...

4 views

రామ్ సీత కి ఉత్తరం రాస్తే...
ప్రియమైన సీత గారికి..

శ్రావణం కాబోలు..
చిరుజల్లులు మంచుముత్యాల్లా
మేనిని తడిపేస్తున్నాయి..
మనసుని తడిమేస్తున్నాయి..
అచ్చం జాబులోని మీ మాటల్లానే..
ఎంతల్లరోయ్...

ఇక్కడి పూలకి సుకుమారం మరీనండి..
మీరు వాటిలా ఉంటారేమో అని
మనసులో అనుకున్న మరుక్షణం ..
సిగ్గేమో వాటికి ..
నా నయనాలకి వేడుకలా మరింత రమణీయంగా కనబడుతున్నాయి..

మీకు పోటీనా..
కోటి పూల సొగసు కూడినా ..
మీతో పోటీనా..
అదసలు కుదిరే పనేనా..

సాయం వేళ మబ్బులుపట్టిన ఆకాశంకేసి చూస్తే...
అదేంటో మీరు రాసిన ఉత్తరాల అక్షరాలు..
నాకోసం ఆ నీలం రంగు కాన్వాసుపై
వడివడిగా అల్లుకుంటున్నాయి,

నా ఒక్కడికే
మీ మాటల్లా వినబడుతూ ..
మీర్రాస్తున్నట్లే కనబడుతూ..

ఏం మాయో..

ఈ హిమామూ, మీ మనసల్లే. ..

మరీ చల్లదనం..
మరులుగొలిపే సౌందర్యం..
అల్లేసుకున్న భావన..
కమ్మేసిన ఆకర్షణ...

ఏంటీ..???
ప్రేమిస్తున్నానా .?
మంచి మనసుని..
మంచు లాంటి మనసుని..

సాయంకాలం కరిగి..
కాస్త నిశి కమ్ముకునే వేళ..
తారలు తళుకులీన
ముస్తాబయ్యే సమయాన...

ఏంటో సీతా..
నీ తొలిలేఖ మొదలు..
ఘడియ కింద.. నా కనులలో నిక్షిప్తమైన
నీ ..ఈ వేళ లేఖ దాకా..

ఆ అక్షరాలే .. నీ రూపమై..
ఆ భావాలే.. అనుబంధమై..
ఈ శశివేళ..
అడుగు దూరంలో నువ్వున్నట్టు..
ఏనాటికీ ..
నాతోనే ఇలా ఉండమని అడగమన్నట్టు..

ప్రతివేళా..నీతోనే ఉంటున్నా ..
నా సమస్తం .. నువ్వే అన్నట్టుగా..

ఇది ..నీ మది అక్షరాల మాయా..
లేక నీ లేఖ భావాల మంత్రమా..

సీతా అని పిలిచేస్తున్నా .. ఏమనుకోకోయ్..

సీతగారు ..
ఇలా పిలవాలని..ప్రయత్నించినా..
మొదటి లేఖతోనే మర్చిపోయా..
ఇపుడు కూడా
కాసేపటికే..మీ నీ గా. మీరు నువ్వుగా..

ఇది కాదు పరివర్తనం ...
నా హృదయం.. నీ ఆవర్తనం .

కాబోయే.. జీవిత భాగస్వామిని..
నా జీవన సారధిని..
ఈ మన ఒంటరివేళల..
గారు అనడమంటే..,
అపరిపక్వ జ్ఞానమావదూ.. కదూ..

ఇలా నీ కబుర్లతో
సమయం సాగుతూ..
చీకట్లు నలుపురంగు
నిర్వచనంలా పరుచుకుంటూ..
ఈ లోకం నిద్దట్లోకి..
మరి నేను ..
నా కలల వెలుగులోకి..
నీ తోడు కదా.. ప్రకాశమే..
అవును,
నా ఊహలూ.. నీ వల్ల కాంతివంతమే..

నిజమోయ్ సీతా.
జాబిలి ఓ వైపు..తోడుగా బోలెడు తారకలు..
సీతామహాలక్ష్మి గారు నా వైపు.. అంతే..

అంతే ..
ఆకర్షణ సమరం అప్పుడే ముగిసింది..
నేనే విజేతనని మళ్ళీ వేరుగా విన్నవించాలా..

ఓ బుంగమూతి జాబిలి..
చిరుకోపాల తారకలు..
మరెందుకోయ్..ఓటమి తెలిసీ..పోటీకి..
పర్లేదు..
నా సీత నవ్వులు కొన్ని మోసుకెళ్ళండి..
మీ అందం.. వేల రెట్లు ఇనుమడిస్తుంది..

ఇది కలలా..లేదు సీత..
కళ్ళెదుట ఉన్నట్టే ఉంది..నా కథ..

నీ వల్ల.. మన ప్రేమకథ..
ఈ కథకి.. నువ్వే ఆది. . నువ్వే అది..

వేకువజామున సడిసేయక
నా కలల నుండి జారుకుని..
పనివేళలనూ..
అనుక్షణం మనసుని పెనవేసుకుని..
నా మదిమాటు ఆలోచనల
రాజ్యం చేజిక్కించుకుని..
నా హృది అంతఃపురాన్ని
నీ ప్రియవశం చేసుకుని..

బదులుగా.. బహుమతిగా. ..

నా పెదాల అంచున ..చెరగని నవ్వుని..
ఈ కనుల చివర.. మెరుపు కాంతిని..
ఇచ్చి..
నన్ను నాకే కొత్తగా..పరిచయం చేస్తున్న..

సీతకి..
నా సీతామహాలక్ష్మి కి...
ప్రేమతో.. నీ రామ్!

ఒక్క నిమిషం ...

ఇంకా మనసు దాటి..
కాగితం గూటికి చేరని పదాలెన్నో..
నీ లేఖాక్షరాల వల్ల..
ఈ ఎద విన్యాసాలెన్నో..

భావాలని ఆపాలని..లేదు
కాలం.. కలం ఆగేలా లేవు

ఈలేఖకి ముగింపు లేదు..
కాస్త విరామం తప్ప...

ఈ లేఖ నిను చేరులోగా
నేను మరిన్ని పదాలని సిద్ధం చేసుకోని..
వాటి సాయంతో
నీతో భావ ప్రకటనా యుద్ధం చేసుకోని..
ఈ ప్రవాహం ఎలా ఆపడం ..
వల్ల కావట్లేదే..
కానీ .. ఈ క్షణం తప్పట్లేదే..

నిను కలిసే క్షణానికై..
నీ వీక్షణకై వేచిచూస్తూ..
నీ చేవ్రాలు..ఆ పరిమళం..
నను వేగిరంగా చేర ఆశిస్తూ..

ప్రేమతో.. సీత కి .. నీ రామ్

© KMISTRY