అప్పటికే ఆలస్యమైంది
మా ఇంట్లో అమ్మ, నాన్న, నాన్నమ్మ, అన్నయ్య మరియు వదిన ఆరుగురం వుంటున్నాం. మా బాబాయ్ కూతురు (మా చెల్లి ) పెళ్లి ఉండటం తో అందరం చాలా రోజుల తరువాత ఊరికి వచ్చారు.
అదృష్టమో, యాదృచ్చికమో అందరు ఒకచోట చాలా రోజుల తరువాత మళ్ళీ ఇలా కలుసుకున్నారు.
బరువు బాధ్యతలు అమ్మకి కొత్తేమి కాదు. కాకపోతే అందరి రాక తో ఇంకాస్త బరువు, ఇంకొన్ని బాధ్యతలు అదనంగా చేరాయి.
రోజు పడుకునే తన నిద్ర లో ఒక గంట తక్కువయ్యింది. చేసే పనుల్లో శ్రమ పెరిగింది, సాయం చేసే చేతులు కోసం అమ్మ ఎదురుచూడదు.
ఆకలిని పట్టించుకోదు, కానీ అందరి ఆకలి గుర్తిస్తాది. అంతా వడ్డించాక మిగిలితే తింటాది, లేకుంటే ఆకలి లేదని అబద్ధం చెప్తాది................. నేను అంతా గమనిస్తూనే ఉన్న.
ఇదే సమయం లో ఒక రోజు అమ్మ కి నాన్నకి చిన్న గొడవ, దాంతో నాన్న అమ్మ తో మాట్లాడటం మానేశాడు...................... కానీ అమ్మ కన్నీళ్లు నాకు మాత్రమే కనిపించాయి.
అమ్మ చాలా అమాయుకురాలు. పిల్లలు, భర్త తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఆ రోజుల్లో చదువు లేదు. నాన్న అంటే చాలా ఇష్టం తో పెళ్లి చేసుకుంది. వరసకి ఇద్దరు భావ మరదల్లే.
పెళ్లైన కొత్తల్లో నాన్న కి ఇంకా ఏ ఉద్యోగం లేకపోవడంతో తాతయ్య మిమ్మల్ని పోషించడం ఇంకా నా వల్ల కాదు అని పెద్ద గొడవ చేసాడు. అన్నయ్య చంటి పిల్లాడు. వాడికి ఇదంతా తెలీదు ఒక్క ఆకలి వేస్తే ఏడుస్తాడు అంతే. వాడి ఆకలి తీర్చడానికి నాన్న ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు.
ఇంతలో నాన్నకి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. కోచింగ్ కోసం డబ్బులు కావాలి. నాన్న తన ఆత్మ గౌరవం చంపుకోలేక తాత ని అడగలేకపోయాడు.
ఆ కష్ట సమయం లో అమ్మ నాన్న కి తోడుగా నిలిచింది. తన తాళిని తీసి పసుపు కొమ్ము కట్టుకుని, దేవుడి దగ్గర తాళిని పెట్టి - మా ఆయన పెద్ద ఆఫీసర్ అయ్యి రావాలి అందుకోసం మీ దీవెనలు ఎప్పుడు మా ఆయన పైన ఉండాలి అని ప్రార్దించి, దాన్ని తాకట్టు పెట్టి వెళ్లి మంచి ఆఫీసర్ అయ్యి రమ్మని నాన్నని పంపింది.
అక్కడికి రెండేళ్లకు నాన్న అసిస్టెంట్ కామెర్సిల్ టాక్స్ ఆఫీసర్ అయ్యాడు. మా కష్టాలు అన్ని తిరిపోయాయి అనుకున్నాం అందరం.
కొన్ని రోజులు గడిచాయి, పరిస్తితులు ఏమి బాలేవు. నాన్న చీటికీ మాటికి అమ్మ మీద అరుస్తున్నాడు, కోప్పడుతున్నాడు, కసురుతున్నాడు. దగ్గరకి రానివ్వట్లేదు. విషయం తెలియని అమ్మ తనలో తానే బాధ పడుతుంది.
అన్నయ్య ని చంకలో ఎత్తుకుని అమ్మవారిని దర్శించునుకుని, తన బాధ ని చెప్పుకుందాం అని గుడికి వెళ్లి తిరిగొస్తుంది. దారిలో నాన్న వేరే అమ్మాయిని బైక్ మీద తీసుకు వెళ్లడం గమనించి, కారణం ఇదా అని ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది.
...