...

9 views

రేవతి

ఓన్నో నీవేనా ఈ దుడ్డ్లు? పక్కన పెట్టిన రెండు రెండ్రూపాయల బిల్లల్ని చూపిస్తూ అడిగింది.

చెన్నకేశవ స్వామి గుడిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ గతంలోకి వెల్లిన నేను తల తిప్పి చూసా... ఇంచుమించు 8 ఏండ్లు ప్రాయం తో కండ్ల మింద పడతాండే ఎర్ర జుట్టును కుడిచేత్తో ఎడంపక్క సరిజేసుకంట మాసిపోయిన వెండి రంగంచు నెమలి రంగు గౌనేస్కోని సన్నని పాప తొర్రి పండ్లతో నగుతాకు నిలవడుకుంది.. పక్కనే తోడుగా ఇంకో పిల్ల...

నావే.. తీసుకుని అంగడి కి పొయ్యి కమ్మరకట్లు కొనక్కొచ్చుకోపోండి..

మ్మే తీసుకుందాం. పక్కన ఉన్న పాప ఆపింది.

వద్దు పా... ఆయన్న ది మనూరు కూడా కాదు... తీసుకుంటే మీ జేజి కి చెప్తా చూడు..

వద్దులేన్నా మేము కూడబెట్టుకన్యాం.. మాకాడ కొనుక్కునేకి ఉండాయ్ లే... నీలెక్క నువ్ తీసుకో..

సరే గానీ నీపేరేంది.. పక్కన పాప ని అడిగినా..

రేవతి..

నీ పేరు?? ఎర్ర జుట్టు పాప ని అడిగా..

రేవతి అనింది ఎకసెక్కెంగా

ఏయ్ పరాచికమాడతనారా నాతో అన్నా నవ్వుకంటా...

ల్యాబ్బ మాయవ్వ సాచ్చిగన్నా నా పేరుగూని రేవతే... ఊ పాప నేను పుట్టినాంక పుట్టింది ఈల్లంమ్మ కి నా పేరు తెల్దు దానికే ఈపాపకి రేవతనే పెట్టింది నేనేం చయ్యల్ల కోపంగా చూస్తూ అంది..


సరే రేవతి బడికి పోతారా మీరు..

మమ్మల్ని రేవతి అంటే మాకు ర్రేగుతాది అనొద్దున్నొ.. తల అడ్డంగా ఆపుతా మెరిసే కళ్ళు చిన్నగ చేసి అంది

ఏ???

ఈ పాప పేరు పిట్టి నా పేరు చిట్టి ముద్దు పేర్లు.. వగలుబోతా చెప్పింది..

నగొచ్చింది నాకు ఆ పిల్ల వయ్యారాలుజూసి

సరేలే బడికి పోతారా లేదా ఇంతకి


అద్దో ఆడ కడ్డీలు కనపడతాండాయే పైన అది మా బడి నేను నాలుగు..

మ్మే నువ్వు ఐదుకు పోతావ్.. న్నా నేను మూడో తర్తి ఈపాప ఐదు..

ఓపా... ఇప్పుడేమన్నా బడింద్యా... నేను నాలుగు న్నా ఈపాప రెండు.. నిజాన్ని కళ్ళింతజేసుకోని అమాయకంగా చెప్పింది.

ఔ మీ అమ్మొల్లు ఏంజేచ్చారు??

మ్మే చెప్పాకు.. పిట్టి చెవి లో చెప్పి "నువ్వు కనుక్కో" అంది నాతో నగుతాకు..

చేను కు పోతారా?? అన్నా..

ఇద్దరు నగుతనారు..

కూలికి పోతారా???

గట్టిగ నగుతాకు... సచ్చిపొయ్ నారు అంది ఏ భావం లేకుండా..

సలకాలతో కొట్టినట్టైంది నాకు

నగుతాండే అమాయకత్వం ఎనక తెలీకుండే బాధ ఊహించలేదు..

జాలి దాస్పెట్టుకునేకి తల దించుకన్నా

(పిట్టి ఇంటికి పాయ వాల్ల జేజి పిలిస్తే)
నా మొఖంలోకి తల తిప్పి తొంగిజూసుకంటా "ఏం న్నా గడ్డం అట్ల పెంచుకన్నావ్?

ఏంలా కరోనా ఉంది కదా??

నీకు వచ్చిందా??? వెంటనే అనింది ఎర్ర జుట్టు రేవతి..

కాదు పాప బయట కరోనా ఉంది కదా అని భయపడి చేపిచ్చుకోడంలా..

ఏం లా మా తమ్ముడి కి మన్న నే గుండు గీకిచ్చినాం మాకేం భయం లేదు..

ఔన్నా నీకు తరిమెల తెలుసా??

తెలుసు..

ఇల్లూరు తెలుసా???

తెలుసు...

పుట్టపత్రి తెల్సా??

పుట్టపర్తి నా??

ఔ!!

తెలుసు నేనాడ సదువుకన్యా..

నీకు హోస్పేట తెలుసా???

ఏం అన్ని అడుగతనావు


పుట్టపత్రి లో హోస్పేట లో మా యమ్మ తమ్ముల్లు ఉండారు...

నాకు ఆటికి పొయ్యేది ఇష్టం..

అన్నం తిన్నావా??

ల్యా పూరీ కాల్చుకున్నాం ఈ పొద్దు.

నువ్వేం తిన్నావ్...

నేనేం తినలేదింకా...

ఆకలైతాందాన్నా???

ఐతాంది రేవతి

మూడు మట్టి పెల్లలు తెచ్చిచ్చా

హు

పెనం తెచ్చా, నూనె తెచ్చా, సలాకు ఇచ్చా..

ఏంటికి

ఏంటికో చెప్పల్లనా చెప్పల్లనా చెప్పల్లనా

హు చెప్పు...

ద్యాలంలో ఎలకలు చిక్కుతాయ్ ఏంచుకోని తిను.. కిల కిలా నవ్వుతూ కేరింతలు కొడుతాంది రేవతి..

అవాక్కయ్యా నేను.. అమాయకపు చిలిపి తనంతో తను ఇంకా నగుతానే ఉంది.

ఈడే ఉంటావా రేవతి నువ్వు??

ఔ మొబ్బయ్యే దాంక ఈడే ఉంటా...

( విలేజ్ వాలంటీర్ వచ్చాడు నాతో మాట్లాడనీకి)
(రేవతి నా కారు వెనుక దాక్కుని చూస్తూ ఉంది)..


నేను: ఎంత వరకు వచ్చింది సర్వే
వాలంటీర్: ఐపోతాది సార్ భోజనం టైంకల్ల

నేను: ఆ పాప వల్లమ్మ నాయనలకి ఏమైన్న్యాది??
వాలంటీర్: వల్ల నాయన పెయుంటు పనిచేసేటోడు హైదరాబాదులో పనిచేసేసాట కింద పడి సచ్చిపొయ్నాడు.
నేను: అయ్యో..!! వాల్ల అమ్మ?
వాలంటీర్: ఎవరితోనో ఎల్లి పోయింది.. (చులకనగా అన్నాడు)
నా మనసు చివుక్కుమంది.. రేవతి నన్ను చూసుకంటా నగుతాంది (అర్థం కాలేదు తనకి వాలంటీర్ అనిండేది.
మ్మేయ్ ఏంజేచ్చానావ్ ఈడ పా ఇంటికి అన్నాడు రేవతిని కోపంగా...

రేవతి భయపడి దాక్కుంది మొఖం బిక్కపోయు..

వాలంటీర్: సరే సార్ నేను పోయెస్తా
నేను: సరే. (నాకు చూడబుద్ది కాలేదు వాడిని.)

రేవతి నా దగ్గరకొచ్చింది

ఆడుకునే పిల్లలని చూపిస్తూ ఆడుకోపో వాల్లతో అన్నా

వాల్లు ఆడిచ్చుకోరు నన్ను..

ఏం నీ ఫ్రెండ్సే కదా వాల్లు

మాయమ్మ కు పుట్టి నారా వాల్లేమన్నా నా ఫ్రెండ్స్ అయ్యేకి??

మీ అమ్మకి పుడితే అక్క చెల్లెళ్లు అంటారు ఫ్రెండ్స్ అనరు అన్నా నేను.

వాల్లు నా సవాసగాల్లేం కారు..
వాల్లు నాతో ఆడరు. మేం వేరే వాల్లు వేరే. వాల్లు కాపోల్లు మేం మాలోల్లం..

ఈడనే ఉండు మాయబ్బ పిలచ్చాండాడు.. పోతనా.....



© Lakshman Andra