...

10 views

మా అమ్మ నాన్న ల ప్రేమకధ
మా అమ్మ నాన్న ల ప్రేమకధ వింటున్న ప్రతి సారి నన్ను పుట్టించడానికి దేవుడు ఇంత పెద్ద నాటకం ఆడించాడు అనిపిస్తుంది....
అది 1995 ఒక పల్లెటూరు కుర్రాడు పని కోసం పట్నం వచ్చాడు, అసలే పట్టణ వాతావరణం...
అందులోనూ మనోడు కుర్రతనం వలన, వచ్చిన వారం రోజుల లో విజయనగరం మొత్తం తిరిగాలి అని అనుకున్నాడు.
అలా తిరుగుతున్న అతడికి పాలు, పెరుగు అమ్మే అమ్మాయి కనిపించింది..
చూడగానే తన పై మనస్సు లో ప్రేమ పుట్టింది.
అప్పటి వరకు ఆకతాయి లా తిరుగుతున్న అతడికి మొదటి సారి అతని వయసు గుర్తొచ్చింది,
తను ఇంకా చిన్నపిల్లాడు కాదని ,
తనకి బాధ్యత గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు..
అసలు తను పట్టణానికి వచ్చింది తను ముగ్గురు అక్కలకి పెళ్లిళ్లు చేయాలని,
దానికి సరిపడా డబ్బు సంపాదించడం కోసం..
అప్పటి నుంచి రోజు పని చేసుకుంటూ,
సమయం దొరికినప్పుడల్లా ఆ పాలు అమ్మే పిల్ల ని చూసే వాడు.
ఇదంతా గమనిస్తున్న ఆ పాల పిల్ల ఒక రోజు అతని దగ్గర కి వచ్చి ''ఏం అబ్బాయి రోజు వచ్చి నన్ను తినేసేలా చూస్తూనే ఉన్నావ్ ఏంటి కధ??"
అని గట్టిగా అడిగింది...
మా నాన్న మామూలుగానే ఎక్కువ మాట్లాడడు, ఇంక ఆ అమ్మాయి అలా ఒక్క సారి అడగ్గానే గుండె జారిపోయినట్లు అనిపించింది..
దెబ్బకు మా నాన్న ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయాడు,
మా నాన్న అమాయకత్వం చూసి ఆమె నవ్వుకుంటూ మళ్ళీ పాలు అమ్మే పని లో పడింది..
ఇది ఇలా ఉండగా మా నాన్న కి తను పనిచేసే వీధి లో జయ అనే ఆమె తో పరిచయం ఏర్పడింది..
ఆమెలో తన అక్క ను చూసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు...
ఆమెను ఎంతో ప్రేమగా జయక్క అని పిలిచేవాడు. జయక్క వాళ్ళ పిల్లలను ఆడిస్తూ గడిపేవాడు..
ఆమె కూడా మా నాన్న ని సొంత తమ్ముడి లా చూసేవారు.
ఇంక మా నాన్న ధైర్యం చేసి తన ప్రేమ గురించి ఆ అమ్మాయి కి చెప్పాలని నిశ్చయించుకున్నాడు..
ఎలాగోలా ఆ పాల పిల్ల దగ్గరకు వెళ్లాడు,
గుండె లో భయాన్ని అణచి వేసుకుంటూ"ఇదుగో అమ్మాయ్ పావు పాలు ఎంత అని అడిగాడు, మళ్లీ తనలో తాను"ఛీ ఛీ నేను వచ్చిన సంగతి ఏంటి??మాట్లాడుతుందేంటి?? "అనుకుంటూ అలా నిలుచుండిపోయాడు .
ఇంతలో ఆ అమ్మాయి లేచి అసలు ఏంటి అయ్యా నీ సమస్య?? రోజు వచ్చి నన్నే చూస్తావ్??
నేను వచ్చి అడగ్గానే పారిపోతావు...
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు...
నాకసలే చాలా పనులున్నాయి...
దాంతో మా నాన్న మా ఊరి ఆంజనేయ స్వామి ని గుర్తుచేసుకుంటూ "మీరు అంటే నాకు చాలా ఇష్టం అండి... మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా.... పల్లెటూరు వాడిని కదా ఎలా చెప్పాలో అర్థం కాలేదు అని అన్నాడు...
అంటే అన్నాడు కానీ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మావోడికి...
దాంతో ఆ పాల అమ్మాయి ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు...
కానీ ఈ విషయం నువ్వు నాతో ఎప్పుడు చెప్తావో అని ఆగిపోయా...
ఎంతైనా ఆడపిల్లని కదా కొంచెం సిగ్గు అడ్డు వచ్చింది..
అంతే తప్ప నువ్వు అంటే ఇష్టం లేక కాదు...
నీ గురించి నేను ఎప్పుడో నీ స్నేహితులతో మాట్లాడాను...
నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అబ్బాయ్ అని అన్నాది..
ఆ మాట వినగానే మా నాన్న ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అలా వాళ్ళ జయక్క దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పాలని వెళ్లాడు..
జయక్క వాళ్ళ ఇంటి కి వెళ్లి చూస్తే మా నాన్న మీద పిడుగు పడినట్లు అయింది...
అక్కడికి మా నాన్న వాళ్ళ అమ్మ(మా నాన్నమ్మ) వచ్చి మా నాన్న పెళ్ళి గురించి మాట్లాడుతుంది...
ఇదంతా గమనిస్తున్న మా నాన్న కి తన ప్రేమ గురించి చెప్పాలి అని అనిపించినా ధైర్యం సరిపోక బయటకు వచ్చేసాడు...
ఇంతలో మా నాన్నమ్మ తో జయక్క ఇలా అంది :- నాకొక చెల్లి ఉంది.
అది వీడికి సరైన జోడి అని చెప్పింది..
దీంతో మా నాన్నమ్మ కూడా ఒప్పుకుంది..
ఇంతలో మా నాన్న ఆ పాల అమ్మాయి దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్పాలని అనుకున్నాడు..
కానీ ఇంతలో ఆ పాల అమ్మాయి వచ్చి తనకు ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరింది అని చెప్పి ఏడుస్తుంది...
మా నాన్న కు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..
తనతో నువ్వు ఇంటికి వెళ్లు , నేను చూసుకుంటాను..అని హామీ ఇచ్చాడు.
కానీ మా నాన్న కి ఏం అర్థం కాలేదు..
ఇంక ఆ అమ్మాయితో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు...
కానీ మా నాన్న కి అంత ధైర్యం లేదు..
ఇంతలో మా నాన్నమ్మ మా నాన్న ని తయారు చేసే పనిలో ఉన్నారు..
అప్పుడు ఆ జయక్క మా నాన్న తో నీకు పెళ్ళిచూపులు ఏర్పాటు చేసాం రా పదా...
అని బలవంతంగా తీసుకువెళ్లారు...
కానీ మా నాన్న మనసు లో ఆ పాల అమ్మాయి ఉంది...
సరే ఏం అయినా దేవుడే దిక్కు అన్నట్లుగా ఉన్నాడు..
ఇంతలో పెళ్లికూతురు వచ్చింది..
ఏదో చూడాలని చూసాడు మా నాన్న...
ఇంక అంతే మా నాన్న ఆనందానికి అవధులు లేవు...
ఆ పాల అమ్మాయే పెళ్లి కూతురు..
ఆవిడే మా అమ్మ...
ఆ జయక్క మా పెద్దమ్మ...
ఈ కధ మా నాన్న తన ఒడిలో నన్ను కూర్చోమని ఈ కధ చెప్పేవాడు..
ఈ కధే నాకు లైలా మజ్ను స్టోరీ...
ఈ కధే నాకు రోమియో అండ్ జూలియట్ కథ.
ఇదే మా అమ్మ నాన్న ల ప్రేమకధ 💗💗
© Dinesh muddada