...

1 views

"ది ఎఫైర్ - 2"


"ది ఎఫైర్ (ruins a human life) - 1" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 2"

అలా నాగమణితో పోలీసుల ఇంటరాగేషన్ పూర్తయింది. ఇక తర్వాత నాగమణి తండ్రి మరియు సోదరుడిని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అందులో భాగంగా ముందుగా నాగమణి తండ్రిని విచారణకు పిలిచారు.

పోలీసు అధికారి : మీ పూర్తి పేరు ?

నాగమణి తండ్రి  : సత్యనారాయణ.

పోలీసు అధికారి : మీరు ఏం చేస్తుంటారు ?

సత్యనారాయణ : నాకు ఒక అరెకరం పొలం ఉంది సారు. కాలక్షేపానికి అది సాగు చేస్తూ ఉంటాను. ఇక నా కొడుకు ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నాడు. దాని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాం.

పోలీస్ అధికారి  : మీరు ఎక్కడ ఉంటారు ?

సత్యనారాయణ : మాది..  ఇక్కడే దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు సారు.

పోలీసు అధికారి : అంటే మీ అమ్మాయిది, మీది ఒకే ఊరా ?

సత్యనారాయణ : లేదు సారు. వాళ్ళదీ మాదీ పక్క పక్క ఊర్లు. పెద్దగా దూరం కాదు.

పోలీసు అధికారి : మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు ?

సత్యనారాయణ : ఆరుగురం.

పోలీసు అధికారి : ఎవరెవరు ?

సత్యనారాయణ : నేను, మా ఆవిడ, కొడుకు, కోడలు వాళ్ల ఇద్దరు పిల్లలు.

పోలీసు అధికారి : సరే సత్యనారాయణ...
మీకు మీ అల్లుడికి ఏ విషయంలోనైనా తగాదాలున్నాయా ?

సత్యనారాయణ : ఈ మధ్యకాలంలో అలాంటివి ఏమీ లేదండి.

పోలీసు అధికారి : అంటే ఇదివరకు ఉండేవా?

సత్యనారాయణ : అంటే అది..! అది..!
(బిత్తర చూపులు చూస్తూ..)

పోలీసు అధికారి : ఎందుకలా నసుగుతున్నావ్ సత్యనారాయణ ? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు ! (గదిమాడు పోలీసు అధికారి).

సత్యనారాయణ : అయ్యా..!
నా కూతురిని చేసుకున్న ఆడొక పోరంబోకు. ఏ పని సరిగా చేయడం చేతకాదు. సంపాదన ఉండేది కాదు. కాళిగా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగేవాడు.
ఆడి తండ్రి ఉన్నంత కాలం ఆడికి సాగింది. అతను పోయాకా నా కూతురి సంపాదన మీదే ఆధార పడి బ్రతుకుతుండేవాడు.
అందుకే మొదట్లో మేము(నేను, నా కొడుకు) వాడిని మందలించే వాళ్ళం. దాంతో మాకు ఆడికి అస్సలు పడేది కాదు. కొన్నాళ్ళు చెప్పి చెప్పి ఇక వదిలేశాం.

ఒక సంవత్సరం క్రితమే వాడు ఒక తిరుగుబోతు, తాగుబోతు అని తెలిసి మందలించాం. అయినా వినక పోయే సరికి ఇక వదిలేసాం. నా కూతుర్ని కూడా వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేయమని చాలా సార్లు బ్రతిమాలాం. కానీ, భర్తను వదిలి రాలేనని అది కూడా మా మాట వినలేదు సారు !
దాని జీవితాన్ని అదో సగం నాశనం చేసుకుంది.

అసలు వాడు బాధ్యతలు అంటే తెలీనోడు. అలాంటోడికి నా కూతుర్ని ఇచ్చి దాని గొంతు కోసి జీవితం నాశనం చేశానని నిరంతరం బాధ పడుతూనే ఉండేవాడిని (బాధపడుతూ). ఇప్పుడు ఆ పీడ విరగడైనందుకు చాలా సంతోషంగా ఉంది సారు(ఒక్కసారిగా మొహంలో ఆనందంతో).

పోలీసు అధికారి : నువ్వు చెప్పేదంతా నిజమా సత్యనారాయణ ? (ఆశ్చర్యపోతూ ప్రశ్నార్థకంగా)

సత్యనారాయణ : అవును సారు ! (సందేహంగా తలాడిస్తూ).
ఎందుకలా అడిగారు ?

పోలీసు అధికారి  : ఏం లేదు...
మీ అమ్మాయిని విచారించినప్పుడు ఇలాంటి విషయాలు ఏం తను మాకు చెప్పలేదు. ఐ మీన్ తన భర్త ఇంత క్రూరుడని !

సత్యనారాయణ  : ఆడపిల్ల.. అదేం చెప్తుంది బాబు ! అసలే కట్టుకున్నోడు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా మాకే ఇంత గుట్టు ఎప్పుడూ చెప్పుకునేది కాదు. పైగా ఆడు పోయాడని పుట్టెడు దుఃఖంలో ఉంది.

పోలీసు అధికారి : అది కాదు...
పెళ్లికి ముందు మీ అమ్మాయి ప్రేమ వ్యవహారం...? (మాట పూర్తయ్యే లోగా)

సత్యనారాయణ  : అబ్బే... అదేం పెద్ద విషయం కాదులే బాబు... తెలిసి తెలియని వయసులో ఏదో చిన్న చిన్న తప్పులు చేయడం ఈ కాలపు పిల్లలకి అలవాటే కదా బాబు...  ఎక్కడ కన్న బిడ్డ దారి తప్పి పోతుందోనని భయపడి, మందలించి నచ్చజెప్పి, దాని భవిష్యత్తు గురించి కూడా పెద్దగా ఆలోచించకుండా ఈ తల మాసినోడికిచ్చి కట్టబెట్టాం. అప్పుడు చేసిన తప్పుకి ఇంతకాలం అనుభవించాం !

పోలీసు అధికారి  : "సరే సత్యనారాయణ. నీ విచారణ పూర్తయింది. ఇక నువ్వు వెళ్లొచ్చు! ఎప్పుడైనా పని పడితే మళ్ళీ నిన్ను పిలుస్తాం." అంటూ సత్యనారాయణను పంపించేశారు ఆ పోలీసు అధికారి.

మహిళా అధికారినికి నాగమణి ఇచ్చిన స్టేట్మెంట్ (వాంగ్మూలం), ఈ సత్యనారాయణ పోలీసు అధికారికి ఇచ్చిన స్టేట్మెంట్ రెండూ సరితూగడం లేదు. నాగమణి ఏమో తమది ప్రేమ పెళ్లి, ఇంట్లో ఒప్పుకోలేదని లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పింది.

ఇక్కడ తండ్రి సత్యనారాయణ మాత్రం...
కూతురు ఇంకెవర్నో ప్రేమిస్తే, ఇంట్లో తెలిసి వేరే పెళ్లి చేశామని చెప్తున్నాడు.

ఇద్దరి స్టేట్మెంట్స్ లలో పొంతన లేని సమాధానాలు.

ఎక్కడో ఏదో తేడా జరుగుతుందనే అనుమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు.
ఇదో పెద్ద సవాలుగా ఉంది వారికి.

ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు ?

ఎవరు అబద్ధం చెప్తున్నారు ?

నాగమణి సోదరుడిని కూడా విచారిస్తే ఇంకేమైనా ఆధారాలు బయటపడొచ్చనే ఆలోచనతో, అతన్ని కూడా విచారించడం మొదలు పెట్టారు ఆ పోలీసు ఉన్నతాధికారులు.

పోలీసు అధికారి      : మీ పేరు ?

నాగమణి సోదరుడు : గంగాధర్.

పోలీసు అధికారి      : మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు ?

గంగాధర్                 : ఫాన్సీ స్టోర్ ఒకటి ఉంది సార్ ! అది రన్ చేస్తూ ఉంటాను.

పోలీసు అధికారి      : మీకు పెళ్లయిందా ?

గంగాధర్                 :  అయ్యింది సార్ ! ఇద్దరు పిల్లలు కూడా.

పోలీసు అధికారి      : మీరు ఉండేది ఎక్కడా ?

గంగాధర్                 : ఇక్కడే పక్క ఊరు.

పోలీసు అధికారి      : పక్కూరు అంటే, మీదీ మీ సిస్టర్ ది ఒకటే ఊరా ?

గంగాధర్                 : లేదు సార్ ! వేరు వేరు. కానీ దగ్గర ఊర్లే.

పోలీసు అధికారి      : మరి మీ అమ్మా, నాన్నా ?

గంగాధర్                 : వాళ్ళు మేము కలిసి ఒక చోటే ఉంటాం సార్ !

పోలీసు అధికారి      : మీ భార్యది, మీది ప్రేమ వివాహమా ? లేక పెద్దలు కుదిర్చిన వివాహమా ?

గంగాధర్                 : దానికి దీనికి ఏంటి సార్ సంబంధం ?(అసహనంతో)

పోలీసు అధికారి      : ఈ కేసుకు సంబంధించి ప్రతీది అవసరమే. ఎదురు ప్రశ్నలు వేయకుండా...
దయచేసి సహకరిస్తే బాగుంటుంది (గంభీరంగా).

గంగాధర్                 : పెద్దలు కుదిర్చిన వివాహమే( కొంచెం చిరాకు కలిగిన ముభావంతో)

పోలీసు అధికారి      : స్వయానా చెల్లెలి భర్త చనిపోతే, కనీసం మీ మోహంలో చిన్న బాధ కూడా కనిపించడం లేదు. సమాధానాలు కూడా చాలా అసహనంగా చెప్తున్నారు ?

గంగాధర్                 : హుం...
వాడు బ్రతికుంటే బాధపడాలి కానీ, చస్తే ఎందుకు బాధ ? (కోపంగా...). అసలు వాడి గురించి ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అంటేనే ఒళ్లంతా కంపరంగా ఉంది. చస్తే చచ్చాడు. మమ్మల్ని వీధిలోకి లాగాడు.

పోలీసు అధికారి      : ఆయనంటే మీకెందుకంత ద్వేషం !

గంగాధర్                 : ద్వేషం కాదు పగ, వాడొక తిరుగుబోతు... తాగుబోతు...
పెళ్ళై... పెళ్ళాం బిడ్డలు ఉన్నా ఏ పనీ, సంపాదన చేతకాని ఓ సన్నాసి వెధవ వాడు !

పోలీసు అధికారి      :  పోనీలే, చనిపోయిన వ్యక్తి గురించి దుర్భాషలు ఎందుకు లే కానీ,
మరి... అలాంటివాడికి మీ చెల్లెల్ని ఇచ్చి ఎలా పెళ్లి చేశారు !

గంగాధర్                 : ముందులో వాడు అలాంటివాడని తెలీదు. తెలియక మేం తప్పటడుగులు వేశాం. మా చెల్లితో ఏడడుగులు వేయించాం.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఏం ఆలోచించకుండా ఆ మూర్ఖుడికిచ్చి దాని జీవితం మా చేతులారానే నాశనం చేశాం.

అయినా వాడొక సైకో..!
నా చెల్లిని చాలా చిత్రహింసలకు గురిచేశాడు. అది కాబట్టి తట్టుకుని కాపురం చేసింది.
అసలు వాడిని సంవత్సరం క్రిందటే చంపెద్ధాం అనుకున్నా...
కానీ, నా చెల్లెలి తాళిబొట్టు, దాని పసుపు కుంకాలు అడ్డొచ్చాయి.

పోలీసు అధికారి      : సంవత్సరం క్రితమా ? అతను ఇంకా దిగజారిపోయి మీ చెల్లిలితో ఏమైనా మూర్ఖంగా ప్రవర్తించాడా ?


గంగాధర్                 :  అంతకంటే నీచంగా ... (గంగాధర్ కళ్ళు నిప్పుల కొలిమిలా మారాయి, పిడికిలి బిగించాడు. పళ్ళు నూరుతున్నాడు.)

పోలీసు అధికారి       : అసలేం జరిగింది ?

గంగాధర్                 : ఇక్కడే టౌన్ లో సరిగ్గా సంవత్సరం క్రితం... ఒక ఆవిడతో హోటల్ రూం కి వెళ్ళడం, ఆవిడతో చనువుగా ఉండడం చూశామని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ, దాన్ని నేను నమ్మ లేదు.
చివరికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తే, వాళ్ళు నా కంట పడ్డారు. చాలా సన్నిహితంగా ఉన్నారు.

ఇదంతా ఏంటని వాడిని గట్టిగా నిలదీస్తే,
వాడు ఏం అన్నాడో తెలుసా...?
వాడు ఏం అన్నాడో తెలుసా...?(కళ్ళు పెద్దవి చేసి, పళ్లూ పట పట మని గట్టిగా కొరుకుతూ)

పోలీసు అధికారి      : హా..! ఏం అన్నాడు ?

గంగాధర్                 : నేను మగాడిని. అది నా ఇష్టం. నన్నడగడానికి అసలు  నువ్వెవడివి ? ముందు నీ చెల్లి ఎవరితో తిరుగుతుందో తెలుసుకో ? అంటూ చాలా అసహ్యంగా, మరింత నీచంగా మదమెక్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వాడిలా సమాధానం ఇచ్చాడు సార్ వాడు...

దాంతో సహనం కోల్పోయిన నేను వాడితో అక్కడే పది మందిలో గొడవ పడ్డాను. వాడి మీద చేయి చేసుకోబోయాను. చుట్టూ పక్కన వాళ్ళు నన్ను ఆపకపోతే ఆ రోజే నా చేతుల్లో చచ్చి ఉండేవాడు. అదే వాడికి చివరి రోజు అయ్యుండేది.

పోలీసు అధికారి      : ఒకే! లెట్స్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ గంగాధర్ !
ముందు ఆ గ్లాసులో ఉన్న మంచి నీళ్ళు తీసుకో..
(టేబుల్ మీద ఉన్న వాటర్ చూపిస్తూ..)

అలా గంగాధర్ వాటర్ తీసుకుని శాంత బడ్డ కొన్ని క్షణాల తర్వాత ...

పోలీసు అధికారి      : మీ బావకి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని అంటున్నారు.
అసలు ఆవిడ ఎవరు ?
ఆవిడకి, మీ బావకి మధ్య ఉన్నది అక్రమ సంబంధమేనా ?
ఆవిడ గురించి మీకేమైనా ఇంకా వివరాలు తెలుసా ?

గంగాధర్                 : లేదు సార్ ! ఆవిడ గురించి నాకు పెద్దగా తెలీదు. ఆరోజే ఆవిడని మొదటి సారి చూడడం, చివరి సారి కూడా ...
నన్ను చూసిన వెంటనే దాన్ని అక్కడినుండి పంపించేశాడు వాడు. మా ఇద్దరికీ గొడవ జరుగుతుంటే అది మెల్లగా జారుకుంది.

పోలీసు అధికారి      : ఇంత జరుగుతుంటే మీ చెల్లికి ఇలాంటి విషయాలు ఏం తెలీవా?

గంగాధర్                 : అదొక పిచ్చిమాలోకం సార్ ! ఎంత సేపు భర్త, బిడ్డే దాని ప్రపంచం. వాళ్ల బాగు మాత్రమే కోరుకుంటుంది. ఎన్ని సార్లు వాడిని వదిలేసి పుట్టింటికి వచ్చేయమని చెప్పినా అసలు వినేది కాదు. అందుకే చెప్పి చెప్పి మేము కూడా వదిలేశాం.

పోలీసు అధికారి      : "సరే గంగాధర్..,
ఇక మీరు వెళ్ళొచ్చు ..!  మీ అవసరం ఏమైనా ఉంటే మళ్ళీ పిలుస్తాం." అంటూ గంగాధర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అతడిని పంపించేశారు ఆ పోలీసు అధికారులు.

కానీ పోలీసులు మాత్రం వాళ్ల ముగ్గురు చెప్పిందంతా విని తలలు పట్టుకున్నారు. ఎందుకంటే ఒకరి సమాధానాలు ఇంకొకరి సమాధానాలతో సరితూగడం లేదు. అసలు ఎక్కడా పొంతన కుదరదడం లేదు.

నాగమణి ఏమో...
తమది లవ్ మరేజ్ అంది.

నాగమణి తండ్రి...
నాగమణి ఎవర్నో లవ్ చేస్తే, తప్పనిసరి పరిస్థితిలో వేరొక వ్యక్తి (శివరాం)తో పెళ్ళి జరిపించినట్టు చెప్తున్నాడు.

ఇక గంగాధర్ అయితే,
అతను కూడా తండ్రి చెప్పినట్టే చెప్పాడు. కానీ ఈ మధ్య శివరాం కి వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని అసలే మలుపులు తిరుగుతున్న కథలో ఇంకో మలుపుని చేర్చాడు.

అసలు ఏది నిజం ?

ఇంతకీ ఆ మహిళ ఎవరు ?

పోలీసులు ఈ కేసుని ఎలా చేధించబోతున్నారు ?

లాంటి విషయాలు తర్వాతి భాగాలలో తెలుసుకుందాం...

తర్వాతి భాగం "ది ఎఫైర్ (ruins a human life) - 3" కొనసాగబోతుంది.

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.
అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



© @mr.satya's_writings