...

12 views

మల్లి.. మల్లిగాడు.. ఓ లవ్ స్టోరీ
మల్లీ.. ఏమైందే
పొద్దుగాల మంచిగనే ఉన్నవ్ గదా
పొలంకాడికి పొయ్యి రాంగనే ఏమైందే
ఎవలన్న ఏమన్న అన్నరాయే
అయినా నువ్వెవల్నీ అనకుంటే జాలు. నిన్నెవలేమంటరు గనీ..అన్నది మల్లి ని వాళ్ళ అమ్మ రాజవ్వ.

అనుకోయే..నీకు ఏది తోస్తే గదే అనుకో. నన్ను అడగకు. నేను జెప్ప. అయినా ఏమైందని జెప్పాలె నీకు. ఇంట్లకొచ్చుడు తోటే షురూ జేశ్నవ్ ఇయ్యాల. నేను బయటకు పోతున్నతీ. నువ్వే ఉండు ఇంట్ల.

అయ్యో ఏమన్ననే గిప్పుడు.
పరేషాన్ ల ఉన్నట్టు గొడ్తున్నావ్ ఏమైందే అని అడిగిన. తప్పా బిడ్డా

గదెం లేదే అమ్మ. ఉంటే జెప్తా తీ నీకే. నేను గీడిదాంక పొయ్యొస్తా. జర ఒర్రిపియ్యకు. నీకు దండం పెడ్తా


ఏడికే బువ్వ సుత తినకుండా.
దోస్తుల్ని ఇంటి ముంగటికి పొయ్యి పిలిస్తే ఉరుక్కుంటా వొస్తరు. ఏం గావలన్నా పక్కపొంటే దుకునం. ఇంకేడికి బిడ్డా పొయ్యెడిది

అమ్మా... వొచ్చినంక జెప్తా
అడగకే గిప్పుడే. మల్ల అనుకున్నది గాకుంటే మంచిగనిపియ్యది

అరే మల్లిగా.. నీ పోరి గిటే వొస్తుంది రా.

ఇగో..నీతోని జర మాట్లాడాలే.

అరే మీరు వీరి గాని పొలంల ఉండుండ్రి. ఆడికే వొస్తా నేను.
సరే తీ రా ముచ్చట అయినంక నే రా.
పైలం రోయ్

ఏంది పిల్లగా రెండ్రోజుల సంది కనవడత లేవు. ఏడికి పొయ్యినవ్..

ఏడికి బోలె మల్లి.. ఇంట్లనే ఉన్న. బయటికి రాలే. జెర మనసు మంచిగ లేకుండే.

ఏమైందని

నా పిల్ల కి...ఏమి లేదు తీ. నువ్ జెప్పు . ఏందో జెప్పనీకి వొచ్చినవ్ గదా. ఏంది ముచ్చట

ఇగో సూడు పిల్లగా.. నేను ఒక్కపారే జెప్తా.మల్ల మల్ల అడగొద్దు.
నువ్ నా ఎనకాల బడి తిరిగినంత రోజులు మస్తు గమ్మతు గ ఉండే.
యాష్ట వొచ్చినట్టు జేస్తుంటి గనీ నువ్ కండ్ల పడకుంటే మనసుల పడ్తాలేదు.
ఏందో ఏమైందో తిన్నా పన్నా నువ్వేయాదికొస్తున్నావ్.
మా అయ్య పెండ్లి జేస్తా అని సంబంధం జూస్కొని అచ్చిండు. ఎప్పుడో మనసయింది నీ మీద గనీ ఇగ సిగ్గు తోటి జెప్పలే. గిప్పుడు సుత జెప్పకుంటే...ఇగ నా బతుకంత ఏడుపే.
ఏం ఏశాలు తెల్వని నాకు పేమ దోమ అన్ని నేర్పినవ్..గిప్పుడు నిన్ను సూడకుంటే పిచ్చి లేస్తున్నది.
ఆడపిల్లను అయినా సిగ్గిడిశి అడుగుతున్నా..నన్ను పెండ్లి జేసుకుంటావా. చేసుకుంటే నిన్నే లేకుంటే గిట్లే ఉంటా. చెప్పు
అరే ఏమైంది పిల్లగా నవ్వుకుంటా ఏడుపేంది
మల్లి..నా బంగారుమల్లి
నీ పెండ్లి ముచ్చట నాకే ఎర్క ముందుగాల. మీ అయ్య నాతోనే జెప్పిండు. అడిగిండు సుత..మల్లి ని జేసుకుంటావారా అని. నీ మనసుల ఉన్నదేదో తెల్వకపాయే. నీకు సరే అంటే చేసుకుంటా అన్నా. ఇంతట్ల పక్కూరోళ్ళు
ఎదురు కట్నమిచ్చిజేసుకుంటామని వొచ్చిన్రు. మీ అయ్య ఖుష్ అయిండు.
గదే ఖాయం జేషిండు. నువ్ నన్ను యిడిషి పోతావనే బాధతోటే రెండొద్దులు ఇంట్లనే ఉన్నా.
గిప్పుడు నువ్వే సరే అన్నవ్
చేసుకుంటానే పిల్లా నిన్ను పెండ్లి
కడుపుల పెట్టుకొని సాదుకుంటా
మీ అయ్యకాడికొచ్చి మాట్లాడుతా
ఇంటికి పో యిగ

సరే
పొయ్యెస్త మల్ల
జల్ది రా ఇంటికి.. ఎదురుజూస్తుంటా

మల్లిక కు మల్లేశ్వరునికి పెళ్లి కుదిరింది
ఊరూ వాడా అక్షింతలేసి దీవించి వెళ్ళింది



© Nakshathra