...

2 views

అలా భద్రాద్రికి...
#అలాభద్రాద్రికి #భద్రాచలం #తీర్థయాత్ర #story @sivasri

ది. 11-03-2023 అనగా శనివారం తెల్లవారుజామున గం.12:40నిలకు ఇంటి నుండి బయల్దేరాం.సుమారు గం.1:00కి చిన్న బస్సు ఎక్కి బయలు దేరాము.
చల్లని గాలి మంచు పొరలు దాటుకుని మమ్ముల్ని తాకుతుంటే పరవరసించి పోతున్నాము. మా ఊరి వాల్లందరమూ (మా బంధువులే) కలిసి చిన్న బస్సులో ప్రయాణం చేస్తున్నామేమో సరదా కబుర్లుతో సాగిపోతుంది పయనం.ఆకాశమంతా నిర్మలంగా ఉంది.చుక్కలెక్కడో దాగునట్టున్నాయి కానరావట్లే కనులకు.జాబిలమ్మ ఏ వైపున ఉందో... చీకట్లో చెట్లే దూరపు కొండల్లా కనిపిస్తున్నాయి.చిన్న బస్సు చాలా వేగంగానే వెళ్తుందండోయ్, తెల్లవారుజామున ప్రయాణమేమో రోడ్డు ఖాళీగా ఉండడంతో కాస్త వేగంగానే పోతుంది వాహనం.మా చిన్ని రథానికి ఇంధనం వేయించారు. సరిగ్గా అక్షరాల 2020రూపాయలు అయ్యింది. మా ఊరి రామాలయం కూడా 2020లోనే విగ్రహ ప్రతిష్ట కావడం ఆ మధుర స్మృతులను నెమరవేసుకున్నాము.విద్యుద్దీపాల వెలుగుల్లో కోనసీమ ముఖద్వారం ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేము.జొన్నాడ వారధి వద్ద జాబిలి ప్రత్యక్షమైనది . చల్లని గాలి చెక్కిళ్ళను వేగంగా మీటుతూ ఉంది.చడీచప్పుడూ లేకుండా గోదారి ప్రవహిస్తూ ఉంది.ఓ వైపు మంచి సంగీత స్వరాలు వినిపిస్తున్నాయేమో ఆ నిమిషం అమితమైన ఆనందమే మనసుకి.
కొబ్బరి చెట్లన్నీ దూరాన్నుండి కవాతు చేయడానికి నిల్చున్న సైన్యమల్లే కనిపించసాగాయి.కడియపులంకలో మొక్కలన్నీ చీకటికి నేలపై నల్లని తివాచీ పరిచినట్లుగా ఉన్నాయంటే అతిశయోక్తే కాదు.చుక్కలన్నీ ఏ దిక్కులకేగాయో గానీ నల్లని బుగ్గ పై తెల్లని చుక్క దిద్దినట్టే ఉంది జాబిలి కొలువైన ఆకాశం.
వెలుగుతున్న విద్యుద్దీపాలతో కూడిన రాజమహేంద్రవరానికి వెళ్ళే రహదారి తెల్లవారిపొద్దు బహు చక్కగా నున్నది.బహుశా ఈ దీపాలు కూడా వెన్నెలను. కురిపిస్తున్నాయేమో....,నిత్యం జనాలతో రద్దీగా ఉండే రాజమహేంద్రవరం రోడ్లు బోసిపోయి ఉన్నాయి. బహుశా సమయం తెల్లవారుజామున రెండు అయినందుకేమో.ఆ సమయాన చల్లని గాలి తాకిడికి కాస్త చలిగా కూడా అనిపించింది.అంత చల్లగా వీస్తోంది గాలి.మేము వినే పాటలకు చక్కటి సంగీతాన్ని కూడా చేకూర్చుతుంది ఈ చల్లని చిరుగాలి.కనురెప్పలేమో మెల్ల మెల్లగా మూతలు బడుతున్నాయి. ఎవరు మాత్రం ఆపుకోగలరు నిద్రను ఆ ఆసమయంలో చిరుగాలి చల్లగా మీటుతుంటే...
కోరుకొండలో కొండమీదున్న లక్ష్మీనరసింహస్వామి గుడి ఆ చీకటిలో దూరాన ఉందేమో విగ్రహం లానే కనిపిస్తున్నది.రెండున్నర ఆ ప్రాంతానికి చిన్న చిన్న పంటకాల్వలు కూడా అద్దాల వలే పారదర్శకంగా ఉన్నాయి.
ఐ. పోలవరం వచ్చేసరికి కొండలు చాలా అందంగా ఎంతో నున్నగా ఎవరో చెక్కినట్లు క్రమాకార శంఖువుల్లా ఉన్నాయి.
అవి ఆకాశపు అంచులను తాకేలా ఉండి భూమ్యాకాశాల మధ్య నిలువెత్తు గోడల్లా అగుపిస్తున్నాయి.
సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకు రంపచోడవరం చేరాము. చెట్లతో కూడిన కొండలు రంపచోడవరలోకి రావడానికి మాకు స్వాగతం పలికాయి.
చిన గెద్దాడలో రోడ్డుకి కుడి వైపున, వరుసగా బేర్చిన వరి కుప్పల్లా ఉన్నాయి ఆ కొండలు.మూడున్నర ఆ ప్రాంతానికి మారేడు మిల్లు చేరుకున్నాము. అక్కడి వెళ్ళే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా చీమలు కూడా చలించలేని విధంగా రకరకాల చెట్లు నిండి ఉన్నాయి.పెద్ద పెద్ద బండరాళ్లు దండిగా వున్నాయి.రోడ్డు మార్గము ఎగుడుదిగుడుగా, మెలికలు తిరుగుతున్న పాములా ఉంది.తెల్లవారుజామున గం.3.40నిల ఆ ప్రాంతానికి మారేడు మిల్లు కేంద్రంలో రథము ఆపి మా రథ సారధి నిద్రించుచున్నాడు.వెనుకనుండి మా కోతి మూక హాస్యపు మాటలతో అందరినీ నవ్వించున్నాము. పాపం మా రథ సారధికి నిద్రపట్టిందో లేదో. ఆసమయంలో మా రథము యొక్క కిటికీలన్నీ అద్దాలతో మూసివేశాము.తెల్లవారుజామున అగుటచే కిటికీ అద్దాలకు మంచు తెరలు కప్పుకున్నాయి.మళ్ళీ రథము బయల్దేరింది కొంతసేపటకి ఘాట్ రోడ్డుకి చేరుకున్నాము.ఇది చూడడానికి చుట్టలు చుట్టుకున్న కొండచిలువ వలె యున్నది.ప్రయాణిస్తుంటే ప్రదర్శనలో "నెమ్మదిగా కదిలే బ్రేక్ డాన్స్"ఎక్కిన అనుభూతి కలిగింది.అలా వెళ్తూ వెళ్తూ ఉదయం గం.5;30ని.ల ఆ ప్రాంతానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చేరుకున్నాము.అప్పటి వరకు చీకటి దుప్పటిలో దాగి ఉన్న రవిబింబం కొద్దిగా తొంగి చూస్తుంది.గువ్వలు మధురమైన స్వరముతో కూయడం మొదలు పెట్టాయి.రోడ్ల పక్కన పంటలు మొదలుకొని చెట్లు అదేదో అవరోహణ క్రమంలో అమర్చినట్లు కొండల వరకూ వ్యాపించి ఉన్నాయి.ఇరువైపులా పచ్చని చెట్లను పరుచుకున్న కొండలతో ఆ రోడ్డు మార్గము చాలా అందంగా ఉంది.మధ్యమధ్యలో చిన్న చిన్న వాగులతో దుర్భేద్యమైన రంగురంగులచెట్లతో ఆ ప్రకృతి సౌందర్యాలు వర్ణణాతీతం. చిన్ని చిన్ని గువ్వల చిలిపి పలుకులు వినబడుతూనే ఉన్నాయి.చింతూరులో రోడ్డుపై కోతుల గుంపు శ్రీ రామ చంద్రుడు సముద్రం పై వారధి నిర్మించే సమయంలో వానర సైన్యంలా ఉంది. భద్రాద్రికి 7 కి.మీ ఉందనగా సరిగ్గా ఉదయం 7 గంటలకు రవిబింబంతో కూడిన ఆకాశం జాతరకు ముస్తాబు అయిన అమ్మవారి వలె అగుపించింది.పచ్చని పచ్చని పంట పొలాలు భద్రాచలంలోనికి స్వాగతం పలికాయి.
సరిగ్గా ఉదయం గం.7:15ని.లకు బస్సు దిగాం.
తరువాత కాలకృత్యాలు తీర్చుకుని గోదావరి నది లో తలస్నానమాచరించి ఉదయం గం.8:30ని. కల్లా గుడికి వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నాము.దర్శనం కొరకు వెళ్తుండగా మార్గమధ్యంలో రాకుర్తివారిపాలెంలో ఉండే మా బంధువులను కలుసుకున్నాం.వాళ్ళను చూసి, కలుసుకోవడం నాకు చాలా ఆనందమైనది.అలా కలుసుకోవడం యాదృచ్ఛికము.అంతా విధి లిఖితం.దర్శించుకునే ముందు ఒక స్వామిజీ సన్నని కర్రపుల్లతో పొడవాటి కుంకుమ బొట్టు భక్తులందరి నుదుటిపై అద్దుతున్నారు.ఎవరి నుదుటిపై చూసినా ఆ బొట్టు చాలా అందంగా, సన్నగా గోవింద నామాన్ని తలపించే విధంగా ఉంది. సరిగ్గా గం.9;50ని.లకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకుంటిమి.రాతితో చెక్కిన ఆ ప్రతిమలు బహు సుందరంగా ఉండి, వాటికి ఏర్పాటు చేసిన బంగారు ఆభరణ అలంకరణలు మరింత వన్నె తెచ్చాయి.శ్రీ రామ చంద్ర స్వామి వారి ఒడిలో కూర్చుని ఉన్న సీతమ్మ వారి ప్రతిమ వారి ప్రేమకి,ప్రాతివత్యానికి అద్దం పడుతుంది.
ప్రక్కనే ఉన్న లక్ష్మణుని ప్రతిమ అన్న మీద ఉన్న గౌరవానికి, అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది.ఆపై రాముల వారి నిత్య కళ్యాణ మంటప సన్నిధిలో కూర్చుని కళ్యాణాన్ని వీక్షిస్తుండగా వందలాది మంది భక్తుల్లో స్వామి వారి కళ్యాణ లడ్డూ ప్రసాదం మోసే భాగ్యం మాకే దక్కడం ఏనాటిదో పుణ్యఫలం. తదుపరి నిత్య అన్నదాన సత్రంలో భోజనం చేయుట కొరకు వరుసలో నిలబడి ఇంచుమించుగా ఉదయం గం.10;30ని.లకు రసీదు తీసుకున్నాము.సుమారు ఉదయం గం.11;45ని.కల్లా స్వామి వారి నిత్య అన్నదాన ప్రసాదము స్వామి వారిని తలుచుకుంటూ స్వీకరించి మధ్యాహ్నం గం.12:15ని. కల్లా ఆలయం వెలుపలికి వచ్చితిమి.ఆలయం వెలుపల రోడ్డు వెంబడి రామాయణ కాండల్లో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చక్కగా చెక్కబడి ఉన్నాయి.అక్కడి నుండి బయలుదేరి సుమారు మధ్యాహ్నం గం.12:50ని.లకి సమ్మక సారక్కల గద్దె దాటితిమి.తదుపరి సుమారు మధ్యాహ్నం గం.1:30ని.లకి పర్ణశాలకి చేరుకున్నాము.పర్ణశాల వెలుపల ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలను పూజించేందుకు అవసరమగు పూలు, పసుపు, కుంకుమ అమ్మే అంగళ్ళు; దేవుని పటాలు, అలంకరణ వస్తువులు అమ్మే తీర్థ దుకాణాలు;గోళీ సోడాలు అమ్మే తోపుడు బండ్లు దారి పొడవునా ఉన్నాయి.ఆ ప్రాంతమంతా అంగళ్ళతో, జనసంచారముతో కళకళలాడుతూ ఉంది.పర్ణశాల లోపల ప్రాంగణ ప్రారంభంలో కూడా చిన్న చిన్న అందమైన దేవుని ప్రతిమలు, పటాలు మరియు దేవుని ప్రసాదాలు కలిగిన అంగళ్ళు ఉన్నాయి.పర్ణశాల చీల్చిన ఆకుపచ్చని వెదురుగెడలతో నిర్మించిన గోడలు,ఎండు గడ్డితో నేచిన పైకప్పుతో కూడి ఎంతో అందంగా; పూర్వ వైభవాన్ని సంతరించుకున్న ఆశ్రమంలా ఎంతో ప్రశాంతంగా ఉంది.పర్ణశాల వద్ద సీతారాములు ప్రేమను పంచుకున్నట్టు, లక్ష్మణుడు చెవులను ,ముక్కును నరకంగా విలవిబోతున్న శూర్పణఖ, శ్రీరామున్ని ప్రక్కదోవ పట్టించడానికి సీతాదేవిని ముగ్ధురాలును జేసిన మాయల బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు,గీత దాటవద్దని వదినతో చెప్పి లక్ష్మణుడు గీచిన లక్ష్మణరేఖ,అదను చూసుకుని భిక్షమెత్తడానికి మారువేషంలో సన్యాసిగా వచ్చిన రావణుడు, రావణుడి భయంకరమైన నిజస్వరూపాన్ని జూచి మూర్ఛపోయిన సీత, సీతను కొండతో పెకలించుకొని ఎత్తుకెళ్తుండగా ఆమె ఆర్తనాదాలు విని కాపాడడానికి వచ్చిన జటాయువు. రావణుడు రెక్కలను, కాళ్ళను నరికివేయగా నేలకూలిన జటాయువు. మొదలైనవి ప్రాణంతో కూడిన శిల్పాల్లా ఉండి, అరణ్య కాండ సన్నివేశం మొత్తం కనులముందు కదులాడుతున్నట్లు ఉంది ఆ పంచవటి.ఈ పంచవటిలో సీతమ్మ వారి పాదాలు పూలతో ప్రత్యేక పూజలు అందుకుంటున్నాయి.
నేను పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూసి ఇంచుమించు పది సంవత్సరాల తర్వాత భద్రాచలంలో ఉన్న పారన్ నాయుడు అనే నా స్నేహితుడు పర్ణశాల వద్ద నన్ను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది.
పర్ణశాలకు వెళ్ళే మార్గమధ్యంలోనే అనగా పర్ణశాలకు 1- 2 కిలోమీటర్ల ముందే సీతమ్మ వారు జనపనారతో నేచిన చీరలు ఆరేసిన ఆనవాళ్ళు, సీతారాములు పండ్లూఫలాలూ తిన్న శిలలు, రాముడు సీతకి ఇచ్చిన పసుపు, కుంకుమ రాళ్ళు వాటిని చేరుటకు సన్నని వాగుపై ఇనుప వారధి, వాటిని వీక్షించడానికి మరియు తిరుగు ప్రయాణానికి కర్రల వంతెన అన్నీ కూడా చాలా సుందరంగా ఉన్నాయి.ఆ వాగులో మూడు రాళ్ళు వేసి సీతారాములను తలచుకునే ఆచారం అక్కడ ఉన్నది.తరువాత సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణము పట్టాము.ఒక్కసారిగా గుండెలు బరువెక్కాయి.సీతారాములు మా నుంచి దూరంగా వెళిపోతున్నట్టు అనిపించింది.అక్కడి పచ్చని పైరు కూడా పెడమొహం పెట్టుకునే టాటాలు చెబుతూ సాగనంపింది. మేము వచ్చి ఒక్కరోజు కూడా అవ్వకుండా వెళ్ళిపోతున్నామని చెట్లు అలిగినట్లున్నాయి, కాస్తయినా అలికిడి లేదు వాటి నుండి.మేము విడిచి వెళ్తున్నామనే విచారంతో కొండలు కార్చే కన్నీరు సెలయేర్లై పారుతుంది.అలా బాధను దిగమింగుకుంటూ భద్రాచలం దాటి వచ్చేసాం.
భద్రాచలం దాటి కొంత దూరం వచ్చేసరికి రోడ్డు పై పశువులు అడ్డువచ్చి ఒక మూడు చక్రాల ఆటో ప్రక్కనే ఉన్న తోటలోకి మా కళ్ళముందే తిరగబడిపోయింది. ఆ రోడ్డు తోటకి ఎత్తులోనే ఉంది. వెంటనే మా కుర్రకారు వెళ్ళి ఆటోలో ఉన్న వారిని బయటకు లాగి, ఆటోను రోడ్డు పైకి నెట్టాము. ఆ చుట్టుపక్కల వారు కూడా తగిన సహాయం చేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు.పర్ణశాలకి వెళ్ళేటప్పుడు కూడా మార్గమధ్యంలో ఒక కారు మరియు ఒక మూడు చక్రాల ఆటో ఎదురెదురుగా చాలా వేగంగా ఢీకొన్నాయి. దేవుని దయ వల్ల ప్రాణ నష్టం జరగకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు.మళ్ళీ మా రథమెక్కి పయనమాడుతుండగా కాస్త సమయానికే మా రథము నుండి పొగలు వచ్చాయి. పొగలు రావడం గమనించిన మేము ఒక్కసారిగా ఆశ్చర్యానికి, అయోమయానికి గురయ్యాము.అంతే వాహనాన్ని అక్కడే ఆపివేశాము. మళ్ళీ రథాన్ని ప్రారంభిస్తుంటే మళ్ళీ పొగలు వచ్చేస్తున్నాయి. వెనువెంటనే రథాన్ని అక్కడే నిలిపివేశాము. ఏమి జరిగి ఉంటుందో అని ఒక్కసారిగా అందరం కంగారు పడ్డాము.ఏమి జరిగిందో తెలుసుకునేందుకు చూద్దామంటే మా వద్ద మరలు (స్క్రూ) విప్పే పనిముట్లు లేవు. దారిన వెళ్ళే చాలా వాహనాలను ఆపి అడిగాము. వారి ఎవరి వద్ద
ఆ పనిముట్లు లేవు. కొంత సమయం తరువాత దేవుడు చెప్పినట్లు దోవ పక్కన ఉన్న ఒక ఇంటి వద్ద అడిగాము. వారి దగ్గర ఆ పనిముట్లు ఉండడంతో కాస్త ఊరట లభించింది.అవి తీసుకొని వచ్చి ఏమి జరిగి ఉంటుందో అని చూస్తే పాటల శ్రవణ వ్యవస్థ ( సౌండ్ సిస్టమ్) లోని విద్యుత్ తీగలు అంటుకుని పొగలు వస్తున్నాయి. వాటి నుండి మిగిలిన విద్యుత్ తీగలకు కూడా అది వ్యాపిస్తుంది. ఆపై అందరమూ కలిసి మా ప్రయత్నము మేము చేసి రథాన్ని మరళా సిద్ధం చేసి అంతా ఊపిరి పీల్చుకున్నాము. పనిముట్లు తిరిగి ఇంటి వద్ద ఇచ్చేసాం.ఆ సమయంలో వారు చేసిన సాయం రుణం తీర్చుకోలేనిది.ఆ ఇంటిలో నిండు గర్భిణీ ఉండి, వారి స్తోమత రెక్కాడితే గాని డొక్కాడనిదిగా కటిక బీదరికంలో ఉంది.వారిని చూస్తే హృదయం ద్రవించిపోయినది.మేము తెచ్చుకున్న వాటిలో కొన్ని తినుబండారాలు వారికి ఇచ్చి తిరిగి ప్రయాణమాడాము. అయినప్పట్టికీ ఎప్పటికీ వారి సాయం రుణం తీర్చుకోలేనిదే.వారు మానవత్వంలో శ్రీమంతులే. మరళా పయనం కొనసాగుతూ ఉండగా చింతూరు వచ్చింది. చింతూరు వచ్చే సమయానికి, అదేదో చీకటి మృగం తరుముతుంటే సూర్యుడు పశ్చిమానికి పోయి కొండల వెనుక దాగున్నట్లుగా ఉంది సూర్యాస్తమయమయ్యే ఆ దృశ్యం.
సాయంత్రం గం.6:30ని.ల ఆ ప్రాంతానికి ఘాట్ రోడ్డుకి చేరుకున్నాము.ఆ దారి గుండా వెళ్తుంటే మేము బొంగరాల్లా గింగరాలు తిరుగుతున్నట్లు ఉంది.
ఘాట్ రోడ్డు చివరికి వచ్చేసరికి చెట్లు ఎక్కువశాతం భూమాతకి ఉంగరాల జుట్టు వోలె ఒత్తుగా వంకర్లు తిరిగిఉన్నాయి.
మెల్లగా చీకటి తెరలు కమ్ముకున్నాయి.
చీకట్లో అడవంతా నేల తల్లి యొక్క నల్లని దట్టమైన కురులులా కనిపిస్తుంది.ఆ చుట్టుప్రక్కల ఉన్న నది కాసింత వెన్నెలకు నల్లని గాజు పలకలా మెరుస్తుంది.ఆకాశం నిర్మలంగా చుక్కలతో నిండి ఉండి , చల్లనైన చిరుగాలికి మిణుగురులు గగనాన విహరిస్తున్నాయా అన్నట్టు ఉంది.సుమారుగా రాత్రి గం.7:10నిలకు మారేడు మిల్లు కేంద్రానికి వచ్చాము.అది వెదురు బొంగు చికెన్,బిర్యానీలకు పెట్టింది పేరు. రోడ్డుకి ఇరువైపులా వెదురు బొంగులను కాలుస్తున్నారు.కొంచెం ముందుకు సాగినాక చల్లని చిరుగాలి శరీరాన్ని తాకి ఆపై మనసు తీగలను మీటుతుంటే మనసంతా పులకరించి పోతుంది.ఆ చల్లని చిరుగాలి కి మెల్లగా నిదురలోకి జారుకున్నాను.సరిగ్గా రాత్రి గం.7:44 నిలకు రంపచోడవరం చేరాము. ఆపై రాత్రి గం.8:15నిలకు గోకవరానికి తరువాత రాత్రి గం.8:40నిలకు కోరుకొండకూ చేరుకున్నాము. మళ్ళీ నిదుర తరుముకుంటూనే వస్తుంది. లేచేసరికి సరికి జొన్నాడ వారధి దాటే వచ్చేసాం.
తరువాత రావులపాలెంలో కాస్త అల్పాహారం భుజించి మరళా రథమెక్కి పయనమాడాము. ఆ చిన్న విషయం మరిచితిని అక్కడ అల్పాహారం చాలా అంటే చాలా రుచిగా ఉంది.రావులపాలెం నుండి కొత్తపేటకు వెళ్ళే మార్గంలో కోనసీమ ముఖద్వారం దాటిన వెంటనే ఎడమచేతి వైపు ఉన్నది ఆ హోటల్.
ఆ తరువాత సరిగ్గా రాత్రి గం.11:11నిలకు ఇంటికి చేరుకున్నాము.
ఎన్నో స్మృతులతో మరెన్నో అనుభూతులతో ఇంకెన్నో ఆప్యాయతలతో సాగిన మా ఈ పయనం చిరస్మరణీయం మరియు వర్ణనాతీతం.
ఇట్లు
మీ
బంధుమిత్ర శ్రేయోభిలాషి
శివ






















© శివ శ్రీ...✍️