...

17 views

ఆలోచన- The power of thought
అనగనగా ఓ పచ్చని పల్లెటూరు. ఆ ఊర్లో రాము,రాజు అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు. రాము తెలివికలవాడు కానీ పేదవాడు. రాజు ధనవంతుడు కానీ అహంకారి. ఒకరోజు ఆ ఇద్దరూ వాళ్ళ ఊర్లో జరిగే జాతరకు వెళతారు. రాము జేబు ఖాళీ.చిల్లిగవ్వ కూడా లేదు కనుక అక్కడ జరిగే పోటీల్లో పాల్గొని డబ్బులు సంపాదించి జేబు నింపుకోవాలి అనుకుంటాడు. రాజు జేబు నిండుగా ఉంది కాబట్టి వాటిని ఖర్చుపెట్టి ఎలా జేబు ఖాళీ చేయాలా అని ఆలోచిస్తుంటాడు. కానీ రాము తో ఉంటే ఎక్కడ తనతో డబ్బు ఖర్చు పెట్టిస్తాడో, తను వాడికి డబ్బులు ఖర్చుపెట్టడం తక్కువతనం గా అనుకొని ఓ చిన్న ప్రస్తావన తెస్తాడు. ఆ జాతరలో చెరోవైపు వెళ్లి అరగంటలో కలుసుకోవాలని, ఒంటరిగా ఎవరెవరు ఏమి చేసారో చెప్పుకోవాలనేది రాజు చెప్పిన నిబంధన.రాము కూడా దానికి అంగీకరిస్తాడు. అలాగే చెరోవైపు వెళతారు. అరగంటలో తిరిగి కలుస్తారు. ఎవరు ఏం కోరుకున్నారో అలాగే జరుగుతుంది. రాము అక్కడ జరిగే పోటీల్లో పాల్గొని గెలుస్తూ ఉంటాడు. అన్నీ తనకే తెలుసనే అహంకారం తో నిండిన రాజు పోటీల్లో పాల్గొంటూ ఓడిపోతుంటాడు. రాము జేబు డబ్బులతో నిండిపోయింది. రాజు జేబు ఖాళీఅయింది.

ఇప్పుడీ కథను బట్టి అర్ధమయ్యింది ఏంటి?
తేడా ఎక్కడుంది వీళ్ళలో..
కేవలం వాళ్ళ ఆలోచనల్లో.
ఏం ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించుకుంటే, చెత్తా చెదారమంతా బుర్రలో తిష్టవేసే ప్రమాదమే ఉండదు. చాలా సందర్భాల్లో తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక అవసరాలు దారి తప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ వలలోంచి బయట పడితేనే దీర్ఘ కాలిక లక్ష్యాలను నిర్ణయించుకోగలం. మనల్ని మనం నిర్ధేశించుకోగలం. సాధించాలనుకున్నదీ సాధించగలం.


© Nakshathra