...

6 views

నెచ్చెలి
ఓ పూవు పూస్తే ఆమె గుర్తొస్తుంది
ఓ ప్రేమ కవిత చదివినా ఆమె గుర్తొస్తుంది
ఓ విరహ పాట వింటున్నా ఆమె గుర్తొస్తుంది
ఓ పెళ్లి కబురు వింటున్నా ఆమె గుర్తొస్తుంది
ఇన్ని కళలున్న ఆమె కనులు
ఎన్ని కలలు కన్నాయో...
గుట్టుగున్న తన గాజులు చెప్తాయి
మౌనం కింద నక్కిన పెదవులు
ప్రకృతిపై ఏదో కథను పరుస్తాయి
జాబిలమ్మ నీడలు తన కాగితాల గోడలు
ఎన్ని రంగులు విరుస్తాయో
ఆ వేళ్ళను తాకే కుంచెకు కవ్వింపులో
ఎవ్వరికీ చిక్కదు ఈ చెలి,
చల్లటి గాలికి జోలపాడుతూ
మాయచేసే చిన్నది ఏ మత్తునూ పూనుకోదు
జగత్తులో సారాంశం అచ్చేసుకున్న ప్రేమలేఖలో
అవలీలలను అక్కడే ఆపేస్తుంది
మూసిన కన్నుల కలల తొనలను
తీరిగ్గా లెక్కేస్తుంది
నిశ్శబ్దపు గంభీరాన్ని
తన హృదయంలోనే శాసిస్తుంది
రెక్కలకు హక్కులు లేని ఓ పాత్రకు
సూత్రదారి తానై కదులుతుంది
జీవన నావను సంజీవని
పర్వతాల ఉనికికై దాస్తుంది
తీరం చేసిన మారంలో మొదటి అడుగు
కాస్త గారాన్ని ఏలుతుంది
మక్కువ లేని కొమ్మకు పూచిన
అరుదైన నక్షత్రాల్లా ఉంటాయి ఆ కళ్ళు
తాను గీసిన కాటుక గీత దాటి
మది అస్సలు పోదు
ఎర్రటి సూర్యుడు ఉద్యమించిన
రేకుల తావిని తాకుతూ
మురిసిపోయే పసిడి పిల్లతనం తనది
అక్షరాలను ముద్దాడుతూ
అలసిపోయే అల్లరితనం తనది

© ఉత్పలిని📝