...

9 views

కన్నె కలువ


*****************************
కనులు తెరచి కన్నె కలువ..
కలువ కనుల రేరాజును చూసే,
రేవెల్గు కన్నెతొగ మదిని గెలిచే,
చలివెల్గును మదిని నిలిపే కల్వ.
*****************************
మరుమామను చూసింది మొదలు,
మది మదిలో నిలవలేదా కన్నెకలువకు,
వెన్నెలరాయని రాకకై ఎదురుచూసి,
తొలిసంజ వేళ ముకిళించుకుపోయి,
మలిసంజ వేళ వికసించే ముగ్ద కుముదం.
****************************
ముగ్ద కువలయమును గాంచి,
కల్వ మనోహర రూపమును వలచి,
సహస్రపత్ర సోయగమును మదిని నిల్పి,
ఆ ఉత్పలమును ప్రాణసమముగా వలచెను,
తొలిప్రాయపు గడసరి మిడుకు మధుపము.
*****************************
ప్రాణనాధుని గాంచ నెపమున పద్మము
జలమున నిక్కీ నింగినాశగా వీక్షించువేళ,
ప్రియసఖి నిశాపుష్ప వీక్షణకై విరితేనెమేపరి,
వింతశబ్దమొనరిస్తూ విభ్రమున విరిశరములను,
విరివిగా గురిచూసి కల్వ రొమ్మున విసిరే...
*****************************
కరుగు కాలమ్ము వశమున కృశించు
వేల్పులబువ్వను చూసి వెక్కెక్కి వగచే,
వగచి చారలువారిన ఉదజము మోమును,
చూడ మనసు రాక విలపించే భ్రమరము,
ఘండము రొదను పెడచెవిన పెట్టి, ఆకసమున
అందరాని ఱేరేడుకై ఆశగా ఎదురుచూసే కల్వ.
*****************************
అమావసి నిశాకాలాన చీకటులమిత్తిమోము
కానరాక, తటాకాన భీతిపొందిన కైరవము,
జలమున దూకి ఆత్మబలిదానమొనర్చె,
దవ్వున పరికించు మధుకరము మదిన కుంది,
ప్రియసఖి లేని బ్రతుకు నాకేలనంటూ విలపించి,
విరితేనెలమేపరి విషపుమేపరిగా మారి, 
ఆనందంగా విషపుమేపరిని చేరి ధన్యుడయ్యే.
******************************
                  @సాహితీ@
నాగులపల్లి. త్రినాధ వేంకట కృష్ణ గురుమూర్తి