...

0 views

"శ్రీ కృష్ణ మహా భారతం - 55"
"శ్రీ కృష్ణ మహా భారతం - 54" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 55"

అలా దుర్యోధనుడు దుర్మార్గంగా పాండవులను వధించడానికి వేసిన ప్రణాళికతో అసంతృప్తి చెందిన కర్ణుడి ఆ ప్రణాళిక విరమించుకోవల్సిందిగా సూచిండంతో...
అక్కడున్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు శకుని ఆశ్చర్యపోతూ నిరుత్సాహ పడతారు.

"అంగ రాజా(కర్ణుడిని ఉద్దేశించి)..!
ఈ లోకంలో ధర్మాధర్మాలు ఏమి లేవు.
కేవలం విజయం మాత్రమే ఒక వ్యక్తి యొక్క కీర్తిని ప్రకాశింప చేస్తుంది. ఆ విజయం ధర్మం వలన లభించిందా ? లేక అధర్మం వలన లభించిందా ? అన్న సంగతి ఈ లోకంలో ఎవరికి అవసరం లేదు. కేవలం అతడు విజయం సాధించడంలో పరిపూర్ణుడు అయ్యాడా ? లేదా ? అన్నది మాత్రమే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుంది." అంటూ శకుని మరింత కటినంగా మాట్లాడతాడు.

దానికి కర్ణుడు...
"నాకు తెలిసిన ధర్మం...!
శత్రువుతో నేరుగా యుద్ధంలో పాల్గొని, అయితే శత్రువు యొక్క సిరశ్చేదన అయినా జరగాలి లేదా నా గుండెల్లో శత్రువు అస్త్రాలైనా దూసుకుపోవాలి. అంతేకాని ఇలా రహస్యంగా శత్రువుని ఒడించడమంటే, భౌతికంగా మనం గెలుపొందిన మన అంతరాత్మ ఓడిపోయి మరణించినట్టే, ఈ అధర్మ యుద్ధంలో నేను పాల్గొన లేను. అందుకు నా నుండి మీకు ఏ సహకారం లభించదు. నన్ను క్షమించండి..!" అంటూ దుర్యోధనుడితో అంటాడు.

"అంటే మీరు ఇప్పుడు పాండు కుమారుల వైపు ఉన్నారా అంగ రాజా..!
మీరు గతం మరిచినట్టున్నారు ...!
కులం పేరుతో మిమ్మల్ని దూషిస్తూ, మీ సామర్థ్యాన్ని తక్కువ చేసి, ఆ పాండవులు ఈ రాజ్యానికి మిమ్మల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలనుకున్నప్పుడు ...
మా సోదరులు దుర్యోధనుల వారే కదా మీ వైపు ఉండి మీకు మద్దతుగా నిలిచి, మిమ్మల్ని అంగ దేశానికి అధిపతిని చేసింది.
అప్పుడే మర్చిపోయారా ?" అంటూ దుశ్శాసనుడు సూటిపోటి మాటలతో కర్ణుడిని నిందిస్తాడు.

"ఇక ఆపుతావా దుశ్శాసనా..!
ఇక ఆపుతావా నీ ప్రేలాపనలు..!" అంటూ చాలా కోపంతో, బిగ్గరగా దుశ్శాసనుడి మీద అరుస్తాడు దుర్యోధనుడు.

ఇంకా అదే కోపంతో...
"అసలు నీకు ఏం అధికారం ఉందని, నా మిత్రుడు కర్ణుడిని అన్ని మాటలు అంటున్నావ్ సోదరా దుశ్శాసనా...?
నాకు తెలుసు నా మిత్రుడు ఎప్పుడూ నా శ్రేయస్సు కోసమే ఆలోచిస్తాడు. అతడు చెప్పిన మాటలు మాత్రమే నేను వింటాను. నాకు పలుకుల కన్నా అతడు మాటల్లోనే శ్రేయస్సు కనిపిస్తుంది." అంటూ దుర్యోధనుడు అంటుంటే,

"దుర్యోధనుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు..?" అనుకుంటూ ఆ మాటలకు ఒక్కసారిగా నిష్ణాతులైపోతారు దుశ్శాసనుడు, శకుని.

"తన మిత్రుడు తను చెప్పిన మాటలు వింటున్నాడు" అనే సంతోషంతో కర్ణుడు ఉన్నాడు.

కర్ణుడి సంతోషాన్ని, శకుని - దుశ్శాసనుల విచారాన్ని పటాపంచలు చేస్తూ దుర్యోధనుడు...

"కానీ ఒక్క విషయం..!
నేను నాకున్న సమస్త అధికారాలను, నా ప్రాణాలను ఇప్పుడే త్యజిస్తాను మిత్రమా !
ఎందుకంటే, రాజ్యాధికారం లేని ఈ అధికారాలు, నా ప్రాణం ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే !!" అంటూ కొంచెం డొంక తిరుగుడు మాటలతో కర్ణుడిని చూస్తూ అంటాడు.

దానికి కర్ణుడు...
"నేను ఉండగా నీకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తాను మిత్రమా?
శత్రువుతో యుద్ధం చేసి, నిన్ను ఎప్పటికైనా ఈ హస్తిన సామ్రాట్ గా చూడాలన్నదే నా అంతిమ లక్ష్యం..!" అంటూ దుర్యోధనుడితో అంటాడు.

దానికి దుర్యోధనుడు...
"ఎవరితో యుద్ధం చేస్తావు మిత్రమా ?
పితామహులు భీష్ముల వారితోనా ?
లేక మా పితృదేవుకు దృతరాష్ట్రల వారితోనా ?
ఎవరితో యుద్ధం చేసి గెలుస్తావు నువ్వు !

వారి మద్దతు ఎల్లప్పుడూ ఆ పాండు కుమారుల పైనే ఉంటుంది. ఆ పాండు కుమారులను ఒడించాలంటే, ముందు వారితోనే యుద్ధం చేసి, ఈ రాజ్యాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి. అది అసంభం..!" అంటూ చాలా ఆవేశంగా మాట్లాడతాడు.

దానికి కర్ణుడి దగ్గర సమాధానం ఉండదు. అతడు నిశబ్ధంగా సందిగ్ధంలో పడిపోతాడు.

"ఇప్పుడు చెప్పు మిత్రమా ?
నా ప్రాణాలను త్యజించడం ఉత్తమమా?
లేక స్వయంగా నా పితృదేవులతో యుద్ధం చేయడం ఉత్తమమా !
లేక ఆ పాండవులను వధించడమా ?" అంటూ ముక్కుసూటి ప్రశ్నలతో కర్ణుడిని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు దుర్యోధనుడు.

ఇక దుర్యోధనుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కర్ణుడు...
ఆ దుర్యోధనుడి ముందు రచించిన ప్రణాళికనే అయిష్టంగా ఒప్పుకుంటాడు.

                               ********
ఇక తర్వాతి రోజు,
పాండు కుమారులతో కలిసి, కుంతీ దేవి పురోచనుడి ఆహ్వానం మేరకు వారణవర్తం వెళ్లడానికి సిద్దమయ్యి, అక్కడ అందరి ఆశీస్సులు తీసుకుంటుంది.

అది అక్కడే ఉండి చూస్తున్న కర్ణుడికి మాత్రం లోలోపల తెలియని బాధా, అతని మీద అతనికే తెలియని కోపం !
కుంతీ అందరి వద్దా ఆశీర్వాదం తీసుకుంటుంటే, ఆమెను అలానే చూస్తూ వుండి పోతాడు. ఎందుకంటే, చిన్ననాటి నుండి ఆమెను అతడు ఎంతో ఆరాధించాడు. ఇప్పుడు తిరిగి వెళితే తను ఇంకెప్పటికి తిరిగి రాదనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాడు. అలా అని దుర్యోధనుడి మాట కాదని వాళ్ల ప్రయాణాన్ని అడ్డుకోలేడు.

భీష్ముడు...
"ఆయుష్మాన్ భవా !" అని దీవించగానే కర్ణుడి కళ్ళు తడిబారిపోయాయి.

శకుని...
"మీరు హస్తిన విడిచి వెళ్ళడం మాకు చాలా బాధాకరంగా ఉంది కుంతీ దేవి..!" అంటూ వక్రబుద్ధితో అనగానే కర్ణుడి నరాల్లో  కోపం కట్టలు తెంచుకుంది.

ఇక పాండవులతో కుంతీ వారనవర్తానికి పయనమై హస్తినను వీడుతూ చివరగా కర్ణుడి వద్దకు వచ్చి,
"నాయనా కర్ణా..!
ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు అధర్మం వైపు నిలబడకు...
ఈ హస్తిన కుమారులతో పాటు నువ్వు కూడా నాకు కన్న బిడ్డతో సమానం.
అందుకే, ఓ కన్నతల్లిగా నా మాటను స్వీకరిస్తావని ఆశీస్తున్నాను." అంటూ చివరి మాటగా చెప్పి వెళ్తుంటే,

అప్పటికే చెమ్మగిల్లిన కర్ణుడి కళ్ళు నీటి ప్రవాహంతో తడిసిపోయాయి. తన కళ్ళ వెంబడి వస్తున్న కన్నీళ్లను చూస్తూ కుంతీ కూడా కంట తడి పెడుతూ తన ప్రయాణం మొదలుపెట్టింది.

ఇదంతా గమనిస్తున్న విదురుడు...
"ఎప్పుడూ దుర్యోధనుడికి మద్దతుగా ఉండే కర్ణుడు,
ఈ రోజు పాండవుల పక్షపాతిగా ఉన్నడేంటి, పాండు కుమారులు ఎప్పుడెప్పుడు రాజ్య విడిచి వెళ్తారా అని ఎదురుచూసే దుర్యోధనుడు అతని మిత్రుడు...
ఈరోజు అదే పాండు కుమారులు రాజ్యాన్ని విడిచి వెళ్తుంటే ఎందుకు అంత కలత చెందుతున్నాడు.

దీని అర్థం దుర్యోధన రాకుమారులు, పాండు కుమారులకు వారణవర్థంలో ఏదో కీడు తలపెట్టినట్టున్నారు" అంటూ తన మనసులో అనుకుంటాడు.

చివరకు కుంతీ, తన కుమారులను తీసుకుని వారనవర్థం బయలుదేరి వెళ్తుంది.

ఇక ఆ వారణవర్థం లో ఏం జరుగుతుందో తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 56"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.
అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️