...

2 views

అలా భద్రాద్రికి...
#అలాభద్రాద్రికి #భద్రాచలం #తీర్థయాత్ర #story @sivasri

ది. 11-03-2023 అనగా శనివారం తెల్లవారుజామున గం.12:40నిలకు ఇంటి నుండి బయల్దేరాం.సుమారు గం.1:00కి చిన్న బస్సు ఎక్కి బయలు దేరాము.
చల్లని గాలి మంచు పొరలు దాటుకుని మమ్ముల్ని తాకుతుంటే పరవరసించి పోతున్నాము. మా ఊరి వాల్లందరమూ (మా బంధువులే) కలిసి చిన్న బస్సులో ప్రయాణం చేస్తున్నామేమో సరదా కబుర్లుతో సాగిపోతుంది పయనం.ఆకాశమంతా నిర్మలంగా ఉంది.చుక్కలెక్కడో దాగునట్టున్నాయి కానరావట్లే కనులకు.జాబిలమ్మ ఏ వైపున ఉందో... చీకట్లో చెట్లే దూరపు కొండల్లా కనిపిస్తున్నాయి.చిన్న బస్సు చాలా వేగంగానే వెళ్తుందండోయ్, తెల్లవారుజామున ప్రయాణమేమో రోడ్డు ఖాళీగా ఉండడంతో కాస్త వేగంగానే పోతుంది వాహనం.మా చిన్ని రథానికి ఇంధనం వేయించారు. సరిగ్గా అక్షరాల 2020రూపాయలు అయ్యింది. మా ఊరి రామాలయం కూడా 2020లోనే విగ్రహ ప్రతిష్ట కావడం ఆ మధుర స్మృతులను నెమరవేసుకున్నాము.విద్యుద్దీపాల వెలుగుల్లో కోనసీమ ముఖద్వారం ఎంత అందంగా ఉందో మాటల్లో చెప్పలేము.జొన్నాడ వారధి వద్ద జాబిలి ప్రత్యక్షమైనది . చల్లని గాలి చెక్కిళ్ళను వేగంగా మీటుతూ ఉంది.చడీచప్పుడూ లేకుండా గోదారి ప్రవహిస్తూ ఉంది.ఓ వైపు మంచి సంగీత స్వరాలు వినిపిస్తున్నాయేమో ఆ నిమిషం అమితమైన ఆనందమే మనసుకి.
కొబ్బరి చెట్లన్నీ దూరాన్నుండి కవాతు చేయడానికి నిల్చున్న సైన్యమల్లే కనిపించసాగాయి.కడియపులంకలో మొక్కలన్నీ చీకటికి నేలపై నల్లని తివాచీ పరిచినట్లుగా ఉన్నాయంటే అతిశయోక్తే కాదు.చుక్కలన్నీ ఏ దిక్కులకేగాయో గానీ నల్లని బుగ్గ పై తెల్లని చుక్క దిద్దినట్టే ఉంది జాబిలి కొలువైన ఆకాశం.
వెలుగుతున్న విద్యుద్దీపాలతో కూడిన రాజమహేంద్రవరానికి వెళ్ళే రహదారి తెల్లవారిపొద్దు బహు చక్కగా నున్నది.బహుశా ఈ దీపాలు కూడా వెన్నెలను. కురిపిస్తున్నాయేమో....,నిత్యం జనాలతో రద్దీగా ఉండే రాజమహేంద్రవరం రోడ్లు బోసిపోయి ఉన్నాయి. బహుశా సమయం తెల్లవారుజామున రెండు అయినందుకేమో.ఆ సమయాన చల్లని గాలి తాకిడికి కాస్త చలిగా కూడా అనిపించింది.అంత చల్లగా వీస్తోంది గాలి.మేము వినే పాటలకు చక్కటి సంగీతాన్ని కూడా చేకూర్చుతుంది ఈ చల్లని చిరుగాలి.కనురెప్పలేమో మెల్ల మెల్లగా మూతలు బడుతున్నాయి. ఎవరు మాత్రం ఆపుకోగలరు నిద్రను ఆ ఆసమయంలో చిరుగాలి చల్లగా మీటుతుంటే...
కోరుకొండలో కొండమీదున్న లక్ష్మీనరసింహస్వామి గుడి ఆ చీకటిలో దూరాన ఉందేమో విగ్రహం లానే కనిపిస్తున్నది.రెండున్నర ఆ ప్రాంతానికి చిన్న చిన్న పంటకాల్వలు కూడా అద్దాల వలే పారదర్శకంగా ఉన్నాయి.
ఐ. పోలవరం వచ్చేసరికి కొండలు చాలా అందంగా ఎంతో నున్నగా ఎవరో చెక్కినట్లు క్రమాకార శంఖువుల్లా ఉన్నాయి.
అవి ఆకాశపు అంచులను తాకేలా ఉండి భూమ్యాకాశాల మధ్య నిలువెత్తు గోడల్లా అగుపిస్తున్నాయి.
సరిగ్గా తెల్లవారుజామున 3 గంటలకు రంపచోడవరం చేరాము. చెట్లతో కూడిన కొండలు రంపచోడవరలోకి రావడానికి మాకు స్వాగతం పలికాయి.
చిన గెద్దాడలో రోడ్డుకి కుడి వైపున, వరుసగా బేర్చిన వరి కుప్పల్లా ఉన్నాయి ఆ కొండలు.మూడున్నర ఆ ప్రాంతానికి మారేడు మిల్లు చేరుకున్నాము. అక్కడి వెళ్ళే మార్గంలో రోడ్డుకి ఇరువైపులా చీమలు కూడా చలించలేని విధంగా రకరకాల చెట్లు నిండి ఉన్నాయి.పెద్ద పెద్ద బండరాళ్లు దండిగా వున్నాయి.రోడ్డు మార్గము ఎగుడుదిగుడుగా, మెలికలు తిరుగుతున్న పాములా ఉంది.తెల్లవారుజామున గం.3.40నిల ఆ ప్రాంతానికి మారేడు మిల్లు కేంద్రంలో రథము ఆపి మా రథ సారధి నిద్రించుచున్నాడు.వెనుకనుండి మా కోతి మూక హాస్యపు మాటలతో అందరినీ నవ్వించున్నాము. పాపం మా రథ సారధికి...